అప్పడపు పాట APPADAPU PATA


అప్పడపు పాట (APPADAPU PATA) [PAPAD SONG]

చిన్నప్పుడు భగవాన్ అప్పడాలు అంటే ఇష్టమని తల్లి అగమ్మగారు కొండ దిగి వచ్చి తెలిసినవాళ్లతో  నా కొడుక్కి అప్పడాలు అంటే ఇష్టం అందుకు సరిపడా వెచ్చాలు కావాలి అని సరుకులు సమకూర్చుకొని అప్పడాలు చేయుటకు సిద్దంఅయ్యెను.  ఇది తెలిసి భగవాన్ తల్లిని మందలించి నాకు అప్పడాలు కావాలి అని అడిగానా? వాళ్ళను వీళ్ళను అడగటం దేనికి, ఉన్నదానితో తృప్తి పడవచ్చు కదా. నీకు కావలిస్తే నువ్వు చేసుకో నేను తినను. నేనూ నీకు ఒక అప్పడం చేసి పెడతాను అని చెప్పి ఆ సందర్భంగా అప్పడపు పాటను వ్రాసారు. ఈపాటలో భగవాన్ తత్వసారము మొత్తం కలిపి చాల రుచిగా చేసారు. భగవాన్ చేతి రుచే ఒక మహా అధ్బుతం.

పల్లవి||
ఆప్పడ మొత్తి చూడు - అది తిని నప్పుడే నీ యాశ వీడు  ||అ||
ఇప్పుడమియందున - నే మఱి తిఱుగక
సద్బోధానందుడౌ సద్గురునాథుడు
చెప్పక చెప్పెడు తత్వమగు, సమము
గొప్పది లేనట్టి యొక మాట చొప్పున ||అ||

చరణములు
తానుగాని పంచ కోశక్షేత్రమునందు
తానుగ పెరు గభిమాన మినుములను
నేనెవ్వడను జ్ఞానవిచార తిరుగలిలో
నేను గానని పగుల గొట్టి పిండియు జేసి ||అ||

సత్సంగ మనియెడు నల్లేరు రసముతో
శమదమములనెడు జీలక ఱ్ఱ మిరియములు
ఉపరతి యనునట్టి యుప్పును గలిపి స
ద్వాసన యనియెడి యింగువను జేర్చి
||అ||

రాతి చిత్తము నేను నేనని భ్రమయక
లో దృష్టి రోకటి తోను మానక దంచి
శాంతమౌ కొడుపుతో సమమగు పీటపై
సంతత మలయక సంతసంబు తోడ ||అ||

మౌనముద్ర యనెడి ముగియని పాత్రమున
జ్ఞానాగ్ని చే గ్రాగు సద్బ్రహ్మఘృతమున
నేనది యగునని నిత్యమును బేల్చి
తను దానె భుజియంప దన్మయ మగునట్టి ||అ||